సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం విజయవాడ 39వ డివిజన్‌కు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి మంత్రి వెల్లంపల్లి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దొరక్క రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు మాచర్ల ఏం పని అని సూటిగా ప్రశ్నించారు.
విజయవాడలో బొండా ఉమా, బుద్ధా వెంకన్నలు రౌడీలు అని.. రౌడీలకు చంద్రబాబు పెద్ద నాయకుడు అని విమర్శించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి ఎన్నికలు ఆపాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెపిపనా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. తన నియోజకవర్గంలోని 22 డివిజన్లను గెలిచి సీఎం వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. పిల్లను ఇచ్చిన మామను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీలో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. అందుకు తనే ఉదాహరణ అని చెప్పారు. ప్రజలు అన్ని డివిజన్లలో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు.